నేడు ఆఫ్గానిస్థాన్ తో పోరుకు సిద్దమైన టీమిండియా

వాస్తవం ప్రతినిధి: వరుస విజయాలతో ముందుకెళ్తున్న టీమిండియా నేడు ఆఫ్గానిస్థాన్ తో తలపడనుంది. భువనేశ్వర్ స్థానంలో మొహమ్మద్ షమీని తీసుకోవడం ఒక్కటే భారత్ తుది జట్టులో చేయనున్న మార్పుగా కనిపిస్తోంది. ఫిట్ నెస్ జాగ్రత్తల దృష్ట్యా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఆడించడం ఇబ్బందికరంగా భావిస్తే దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ లలో ఒకరికి స్థానం దక్కొచ్చు. మిడిలార్డర్ లో కేదార్ జాదవ్ కు ఇంతవరకు బ్యాటింగ్ ప్రాక్టీస్ దక్కలేదు. మూడు మ్యాచ్ ల్లో అతడు కేవలం 8 బంతులే ఎదుర్కొన్నాడు. మున్ముందు అవసరాలరీత్యా జాదవ్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేసే వీలుంది. ఓపెనర్ రోహిత్ రెండు సెంచరీలతో ఫామ్ ను చాటగా, కెప్టెన్ కోహ్లీ నుంచి శతకం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇకపై టోర్నీ అంతా పూర్తిస్థాయి ఓపెనర్ గా బాధ్యత మోయాల్సిన నేపధ్యంలో అందుకు తగినట్లుగా సిద్ధమయ్యేందుకు కేఎల్ రాహుల్ కు ఈ మ్యాచ్ సరైన వేదిక.