సుజనాచౌదరి చేత టిడిపి కోట బద్దలు కొట్టబోతున్న బిజెపి.?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేనివిధంగా దారుణంగా ఓటమి పాలవడంతో ఆ పార్టీలో ఉన్న నేతలు భవిష్యత్తు కోసమే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు కాషాయ కండువా కప్పుకున్న విషయం మనకందరికీ తెలిసినదే. వారిలో ఒకరు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి దగ్గరగా ఉండే సుజనా చౌదరి చేత ఇప్పుడు టిడిపి కోట బద్దలు కొట్టడానికి బిజెపి భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

అదేమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను బిజెపి పార్టీ లో చేర్పించే కార్యక్రమం బీజేపీ అధిష్టానం సుజనా చౌదరి కి అప్పగించినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలతో సుజనా చౌదరి కి సత్సంబందాలు ఉన్నాయని,ఆయన వారిని బిజెపిలోకి తీసుకు రావచ్చని చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యవహారం, పార్టీ పిరాయింపుల చట్టం, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం మొత్తంగా చోటుచేసుకునే పరిణామాలకు అనుగుణంగా వీరి చేరిక ఉండవచ్చని చెబుతున్నారు . అందువలన ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలలో ఎవరూ బీజేపీలో చేరే అవకాశం లేకపోయినప్పటికీ జిల్లాలోని మరికొందరు మాజీలను, ఇతరులను బీజేపీలోకి ఆకర్షించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.