వైసీపీ ఎమ్మెల్యేల‌ను తీసుకోవ‌టం త‌ప్పే: జ‌గ‌న్‌ను న‌మ్మి నిల‌బ‌డ్డారు: బుద్దా వెంక‌న్న సంచ‌ల‌నం..!

వాస్తవం ప్రతినిధి: టీడీపీ నేత‌ల‌కు ఇప్పుడు బాధ తెలిసొచ్చొంది. బీజేపీ ఇచ్చిన షాక్‌తో తాము నాడు చేసిన త‌ప్పు గుర్తొచ్చింది. బీజేపీ కంటే జ‌గ‌న్ చాలా బెట‌ర్ అనే స్ప‌ష్ట‌త టీడీపీలో నేత‌ల్లో క‌నిపిస్తోంది. బీజేపీ రాజ్య‌స‌భ‌లో టీడీపీకి చెంద‌ని న‌లుగురు స‌భ్యుల‌ను త‌మ పార్టీలో విలీనం చేసుకోవ‌టం పైన పార్టీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆయ‌న పార్టీ మారిన ఎంపీల‌ను విమ‌ర్శిస్తూనే..వైసీపీ నేత‌ల‌ను ప్ర‌శంసించారు. తాము వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను తీసుకోవ‌టం తప్పేన‌ని అంగీక‌రించారు.

వైసీపీ మీద‌..జ‌గ‌న్ మీద నిత్యం ఆరోప‌ణ‌లు..సవాళ్ల‌తో వార్త‌లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంక‌న్న రూటు మార్చారు. టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలోకి వెళ్ల‌టం పైన ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. అదే స‌మ‌యం లో త‌మ పార్టీ గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాల పైనా కీల‌క వ్యాఖ్య‌లు చేసారు.

వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేల‌ను తాము తీసుకోవ‌టం త‌ప్పేన‌ని అంగీక‌రించారు. వారిని తీసుకోవ‌టం వ‌ల‌న టీడీపీ..అదే విధంగా అక్క‌డి నుండి వ‌చ్చిన వారికి ఎటువంటి ఉప‌యోగం లేద‌న్నారు. ఫిరాయింపుల విష‌యంలో ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని తాను స్వాగ‌తిస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ ఇక త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు తీసుకోద‌నే విషయం అర్దం అయింద‌ని వివ‌రించారు.

స‌ర్పంచ్‌గా సైతం ఏనాడు గెల‌వ‌ని నేత‌లు టీడీపీలో రాజ్య‌స‌భ స‌భ్యులు అయ్యారని ..వారు ఇప్పుడు అధికారం నెల రోజులు లేక‌పోతే పార్టీ మారిపోయార‌ని విమ‌ర్శించారు. సుజ‌నా చౌద‌రి..సీఎం ర‌మేష్ లాంటి వారిని అస‌లు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కొట్టి పారేసారు.

ఇదే స‌మ‌యంలో బుద్దా వెంక‌న్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్..ఎంపీ విజ‌య సాయిరెడ్డిని ప్ర‌శంసించారు. జ‌గ‌న్ ఫిరాయింపుల పైన తీసుకున్న నిర్ణ‌యాన్ని అభినందిస్తూనే..తాను దీని పైన మండ‌లిలోనే అభినంద‌న‌లు తెలిపాన‌న్నారు. అదే విధంగా జ‌గ‌న్ కార‌ణంగా జైలుకు వెళ్లినా..జ‌గ‌న్ క‌ష్టాల్లో ఉన్నా..ఆయ‌న‌తోనే ఉన్న విజ‌య సాయిరెడ్డిని అభినందించా ల్సిదేన‌ని..అటువంటి వారికే ప్ర‌జ‌ల్లో గుర్తింపు ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు. తాము న‌మ్మిన నాయ‌కుడు కోసం ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా వైసీపీలో కొంద‌ర నిల‌బ‌డ్డార‌ని..వారికి గుర్తింపు ల‌భించింద‌ని వివరించారు. బీజేపీ ఎంపీ న‌ర్సింహారావు సైతం ఆ పార్టీ వాయిస్ బ‌లంగా వినిపించార‌ని..రాజ‌కీయంగా విభేదించినా..ధైర్యంగా నిల‌బ‌డి..పార్టీ కోసం మాట్లాడే విజ‌య‌సాయిరెడ్డి..న‌ర్సింహ‌రావు లాంటి వారిని ప్ర‌శంసించాల్సిదేనని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ వైసీపీలోకి తీసుకోన‌ని చెప్పార‌ని..అదే స‌మ‌యంలో ఎమ్మెల్సీల‌ను సైతం తీసుకోర‌ని అంచ‌నా వేసారు. త‌న‌కు పార్టీ మారే అలోచ‌న లేద‌ని బుద్దా వెంక‌న్న చెబుతున్నా..ఆయ‌న స‌డ‌న్‌గా వైసీపీ నేత‌ల‌ను ప్ర‌శంసించ‌టం వెనుక భ‌విష్య‌త్ వ్యూహాలు ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది.