ప్రపంచకప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్..

వాస్తవం ప్రతినిధి: ఎడమచేతి బొటనవేలుకు గాయం కావటంతో భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ 2019లోని మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

వరల్డ్ కప్ 2019 మధ్యలోనే వీడాల్సి రావడంపై టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధవన్ ఎమోషనల్ అయ్యాడు. దీని గురించి ధవన్ ట్వీట్ కూడా చేశాడు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ‘నేను ఇక క్రికెట్ వరల్డ్ కప్ 2019లో భాగం కానని ప్రకటిస్తున్నాను. దురదృష్టవశాత్తు ఎడమచేతి బొటనవేలికైన గాయం సమయంలోగా మానలేదు. కానీ షో మస్ట్ గో ఆన్’ అని రాశాడు.

శిఖర్ ధవన్ ఈ పోస్టులో వీడియో కూడా షేర్ చేశాడు. ఈ వీడియోకి శీర్షికలో రాస్తూ ‘నా జట్టు సహచరులు, క్రికెట్ ప్రేమికులు, మొత్తం దేశం నుంచి ఇంత ప్రేమ, మద్దతు పొందుతున్నందుకు నేనెంతో అదృష్టవంతుడిని’ అని పేర్కొన్నాడు. పోస్ట్ చివరలో జై హింద్ అని కూడా రాశాడు.

మరోవైపు శిఖర్ గాయపడిన వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన రిషబ్ పంత్‌ను లండన్ పంపించింది. కానీ, అతడిని జట్టుతో కలపలేదు. శిఖర్ గాయం తీవ్రత తెలిసిన తర్వాతే పంత్‌ను జట్టుతో కలపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎందుకంటే, ఐసీసీ నిబంధనల ప్రకారం గాయపడిన ఆటగాడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తే.. గాయపడ్డ ఆటగాడు కోలుకున్నా కూడా అతడిని తిరిగి తీసుకునే వీలు లేదు.