కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేయవద్దు: ఎర్రబెల్లి దయాకర్ రావు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన ఏ ప్రాజెక్టూ ఇప్పటివరకూ పూర్తికాలేదని రాష్ట్ర మంత్రి మంత్రి, టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని ప్రశంసించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లారనీ, కాలువల తవ్వకంపై స్టేలు తీసుకొచ్చి పనులను ఆలస్యం చేశారని మండిపడ్డారు. అలాగే శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో నీళ్లు రాకపోవడానికి కాంగ్రెస్ నేతలే కారణమని దుయ్యబట్టారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేయవద్దని ఎర్రబెల్లి హితవు పలికారు. ఇలాగే అబద్ధాలు చెబితే కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు