అసెంబ్లీలో వరాలు కురిపించిన జగన్..!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో చివరి రోజున ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజలకు వరాలు కురిపించారు. గత ప్రభుత్వాలు చంద్రబాబు హయాంలో మహిళలకు, రైతులకు సున్నా వడ్డీ రుణాలను తీసేశారని చెబుతూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలకు ,రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పించి రాజన్న రాజ్యం మళ్లీ తీసుకు వస్తానని జగన్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఒక విధానం , తర్వాత మరో విధానం తమది కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు , మహిళలకు సున్నా వడ్డీ పథకాలను రద్దు చేశారని, తాము మాత్రం వైఎస్ ఆర్ సున్నా వడ్డీ పేరుతో పునరుద్దరిస్తామని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీలు రెండువేల కోట్లు పెండింగులో ఉన్నాయని,అధికారం లోకి వచ్చిన వెంటనే ఆ సబ్సిడీని విడుదల చేస్తూ సంతకం చేశామని అన్నారు. అలాగే రైతుల భీమాను కూడా ప్రభుత్వమే కట్టి, పరిహారం గురించి కూడా ప్రభుత్వమే ఆలోచిస్తుందని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నిధిని రెండువేల కోట్లు బడ్జెట్ పెడతామని ఆయన అన్నారు. రైతుల ధరల స్థిరీకరణ నిధి కింద మూడువేల కోట్లు పెడతామని జగన్ తెలిపారు.