గంపగుత్తగా టిడిపి పార్టీ నేతలు బిజెపిలోకి..!

 వాస్తవం ప్రతినిధి: రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్నడూ లేని విధంగా దాదాపు చావు దెబ్బ తిన్నట్టు గా టీడీపీకి ఆ రాష్ట్ర ప్రజలు కేవలం 23 ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను కట్టబెట్టటం జరిగింది. ఇదే క్రమంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఇటువంటి నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రంలో పాతుకు పోవాలని చూస్తున్న బిజెపి తెలంగాణలో టీడీపీ నేతలను ఆకర్షించే పనిలో పడింది. దాదాపు ముప్పై మంది టిడిపి నేతలు బిజెపిలో చేరతారని ఒక టిడిపి నేత బిజెపి ముఖ్యనేతలకు చెప్పారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి వంటివారు బిజెపితో సంప్రదింపులలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా మాజీ టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు కూడా బిజెపి వైపు చూస్తున్నారని సమాచారం. హైదరాబాద్ లో టీఆర్‌ఎస్‌ నుంచి 5-10 మంది కార్పొరేటర్లు త్వరలో పార్టీ మారే అవకాశం ఉందని బిజెపి నేతలు చెబుతున్నారు. అన్ని పార్టీల నేతలూ సంప్రదిస్తున్నారని మోత్కుపల్లి వివరించారు.