నేను పాక్ జట్టుకి తల్లిని కాదు : సానియా మిర్జా

వాస్తవం ప్రతినిధి: ఆదివారం జరిగిన మ్యాచ్ లో  భారత్ చేతిలో ఘోర పరాజయంతో పాకిస్థాన్ లో విమర్శల పెను దుమారం రేగుతోంది. పాక్ జట్టు క్రికెటర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సామాన్య ప్రేక్ష‌కుల నుంచి మాజీ ఆట‌గాళ్ల వ‌ర‌కు అందరూ పాక్ టీమ్‌ను విమ‌ర్శిస్తున్నారు. అలాగే ఈ అప‌జ‌యం పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు స‌భ్యుడు షోయ‌బ్ మాలిక్ భార్య సానియా మీర్జాకు కూడా త‌లనొప్పులు తెచ్చిపెట్టింది. సోష‌ల్ మీడియాలో సానియాపై ట్రోలింగ్ మొద‌లైంది. సానియా తీరును విమ‌ర్శిస్తూ పాక్ మీడియా కూడా క‌థ‌నాలు వెలువరుస్తోంది.

మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేయనీయ‌కుండా షోయబ్ మాలిక్‌ను సానియా రెస్టారెంట్‌కు తీసుకు వెళ్లిందంటూ పాకిస్తాన్ మీడియాలో కథనం ప్రసారం అయ్యింది. ఈ క్రమంలో రెస్టారెంట్‌లో షోయ‌బ్ జంక్ ఫుడ్ తిన్నాడని, మ‌ద్యం కూడా సేవించాడ‌ని పేర్కొంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా సానియాపై ట్రోలింగ్‌కు పాల్ప‌డుతున్నారు. ఇండియా గెలుపు కోసమే సానియా అక్కడకు వెళ్లిందని, పాక్ ఆటగాళ్ల మనోస్థైర్యం దెబ్బతినేలా ఈమె ప్రవర్తించిందని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లో నటించిన‌ పాక్ బ్యూటీ వీణా మాలిక్ సైతం సానియాను ట్విట‌ర్ వేదికగా విమ‌ర్శించింది.

దీనిపై సానియా మీర్జా తన ట్వీట్ లో ‘వీణా, నేను నా కొడుకుని షీషా ప్యాలెస్ కి తీసుకెళ్లలేదు. మీకు కానీ, మిగతా ప్రపంచానికి కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నేను నా బిడ్డని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. మరో విషయం ఏంటంటే నేనేం పాకిస్థానీ క్రికెట్ టీమ్ డైటీషియన్ ని కాదు, తల్లిని కాదు, ప్రిన్సిపాల్ లేదా టీచర్ ని కాను’ అని గట్టిగా పంచ్ లు వేసింది.