జగన్ పై స్వరం మార్చిన జేసీ!

వాస్తవం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి తాజాగా జగన్ పై స్వరం మార్చారు. అప్పట్లో తన తండ్రి వైఎస్ చనిపోయాక సోనియాగాంధీ నేతృత్వంలో పార్టీ నుండి బయటకు వచ్చి సోనియాతోనే నేరుగా తలపడ్డారనీ జగన్ పై వ్యాఖ్యలు చేశారు. ఆరోజు సోనియా గాంధీ తో జగన్ తలపడాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ లాబీ దగ్గర మీడియాతో జేసీ మాట్లాడుతూ..‘ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చినప్పుడు లేచి నిలబడి సార్.. నేను ఒకడిని ఉన్నాను. గుర్తించండి అంటే అయిపోయేది కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని చేసేందుకు నూటికి నూరు శాతం మద్దతు జగన్ కే ఉంది. పార్టీలో వైఎస్ కొడుకుగా సానుభూతి జగన్ పైనే ఉండేది. కానీ విధిరాత. అలా జరిగింది’ అని తెలిపారు. గతంలో చంద్రబాబు ని పొగిడిన రోజులు విమర్శించిన రోజులు చాలానే ఉన్నాయి అని అంటూ..చంద్రబాబు హయాంలో గ్రామాలను ఆర్ధికంగా పైకి తీసుకురావడానికి అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు కాబట్టే చంద్రబాబును ప్రశంసించానని పేర్కొన్నారు. జగన్ కూడా చంద్రబాబు బాటలోనే నడవాలని కోరుకుంటున్నానని చెప్పారు. జగన్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసనీ, అతనిది ఉద్రేకంతో కూడిన స్వభావమని వ్యాఖ్యానించారు. ఒకడు చెబితే ఆయన వినిపించుకోరని తాను భావించానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.