ఇండియా టాస్ గెలిచి మొద‌ట స్విమ్మింగ్ ఎంచుకుందంటూ సోషల్ మీడియా వేదికగా జోకులు

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లండ్, వేల్స్ వేదిక‌లుగా జ‌రుగుతున్న ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్నిలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు మ్యాచ్ లు వ‌ర్షార్ప‌ణం అయ్యాయి.. ప్రస్తుత టోర్నీకి ముందు వరకు ప్రపంచకప్‌లో 402 మ్యాచ్‌లు జరిగితే.. అందులో టాస్‌ పడకుండా రద్దయిన మ్యాచ్‌లు రెండు మాత్రమే. కానీ ఈ టోర్నీలో ఇప్పటిదాకా గురువారానికి 18 మ్యాచ్‌లు పూర్తి కాగా.. అందులో మూడు టాస్‌ పడకుండానే రద్దయిపోయాయి. మరో మ్యాచ్‌ ఆట ఆరంభమైన కాసేపటికి ఆగిపోయింది. దీంతో ఐసిసి షెడ్యూల్ పై క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపి శ‌శీధ‌రూర్ మ్యాచ్ లు వ‌ర్షార్ప‌ణం కావ‌డం ప‌ట్ల తీవ్రంగా స్పందించాడు.. మొత్తం షెడ్యూల్ ను ర‌ద్దు చేసి తిరిగి అన్ని మ్యాచ్ లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు.. ఇక క్రికెట్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా మ్యాచ్ ర‌ద్దుల‌పై సెటైర్ లు వేస్తున్నారు.. సామాజిక మాధ్యమాల్లో కామెడీ మీమ్స్‌ బోలెడన్ని దర్శనమిస్తున్నాయి. ఐసీసీ ప్రపంచకప్‌ లోగోను మార్చేసినట్లు పేర్కొంటూ కప్పు మీద గొడుగు, దాని మీద వర్షపు జల్లులు పడుతున్నట్లుగా ఉన్న ఫోటో ఒక నెటిజెన్ పెడితే. అలాగే మరో మీమ్‌లో కోహ్లి, విలియమ్సన్‌ నీళ్లు నిండిన మైదానంలో టాస్‌ వేస్తున్న చిత్రాన్ని రూపొందించాడు.. టాస్‌ విలియమ్సన్‌ మొదట ఈదడానికి నిర్ణయించుకున్నట్లు వ్యాఖ్య జోడించడం విశేషం. క్రికెటర్లు నీటిలో ఆడుతున్న మీమ్స్‌కైతే లెక్కే లేదు. ఇక ఏకంగా ఇండియా టాస్ గెలిచి మొద‌ట స్విమ్మింగ్ ఎంచుకుందంటూ జోక్ పేలిపోయింది.