‘‘ఓ వర్షమా.. వెళ్లు.. వెళ్లు. మా మహరాష్ట్రకు వెళ్లు” : కేదార్ జాదవ్

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లండ్లో జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. దీనికి కారణం అక్కడ కురుస్తున్న వర్షాలే. ఇంగ్లండ్ లో ప్రస్తుతం వేసవి కాలం నడుస్తున్నప్పటికీ అకాల వర్షాలు ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో క్రికెట్ మ్యాచ్ లపైనా ఆ ప్రభావం పడుతోంది. కొన్ని మ్యాచ్ లకు అంతరాయం ఏర్పడగా – ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇందులో భారత్ ఆడాల్సిన మ్యాచ్ కూడా ఉంది.

నిన్నటి మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్ కేదార్ జాదవ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొంత సమయంలోనే ఈ వీడియో ట్రెండింగ్ అవుతోంది. వర్షం జోరుగా కురుస్తున్న సమయంలో ఈ ఆల్రౌండర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తూ ‘‘ఓ వర్షమా.. వెళ్లు.. వెళ్లు. మా మహరాష్ట్రకు వెళ్లు. అక్కడి ప్రజలు వర్షాలు పడక కరువుతో అల్లాడుతున్నారు. అక్కడికి వెళ్లి వారికి ఉపశమనం కలిగించు’’ అని వరుణ దేవుడికి ప్రార్థన చేశాడు. దీనిని సహచర క్రికెటర్ వీడియో తీయడంతో ఇది బయటకు వచ్చింది.