రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె

 వాస్తవం ప్రతినిధి: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 10న ఓ జూడాపై దాడి జరిగింది. ఈ సంఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. ఎయిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యుల సంఘం పిలుపు మేరకు సోమవారం దేశవ్యాప్తంగా సమ్మె చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. డాక్టర్ల సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. పశ్చిమబెంగాల్‌లో జూనియర్‌ వైద్యుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు. ప్రాణం పోసే డాక్టర్లకు రక్షణ కరువైందంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను కొనసాగించారు. అంతేకాకుండా, విధులకు హాజరైన కొందరు జూడాలు హెల్మెట్లు ధరించి వైద్యం చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.