ఢిల్లీ ప్రజల కష్టాలను సీ ఎం తో చర్చించిన షీలా దీక్షిత్

వాస్తవం ప్రతినిధి: జూన్ నెల వచ్చినా సూర్యుడి ప్రతాపం తగ్గలేదు. ఎండ తీవ్రతకు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా పలు ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. నీటి కొరతతో పాటు కరెంట్ కష్టాలు కూడా ఢిల్లీ వాసులను వెంటాడుతున్నాయి. కరెంట్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై తట్టుకోలేని భారాన్ని మోపుతున్నారు.

ప్రజల నీటి కటకట కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆరా తీశారు. ప్రజల సమస్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో చర్చించారు. ఇప్పటినుంచి ఆరునెలల పాటు కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని కోరారు. నగరంలో నీటి కొరత, కరెంట్ కష్టాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఫిక్స్‌డ్ ఛార్జీలు, పెన్షన్ ఫండ్ సర్ ఛార్జీల రూపంలో రూ. 7400 కోట్లను ఆప్ సర్కార్ వసూలు చేసిందని ఆయనకు వివరించారు. దీనిపై కేజ్రీవాల్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.