భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ ..వరుణుడి అడ్డంకి

వాస్తవం ప్రతినిధి: వర్షం కారణంగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టాస్ ఆలస్యమైంది. అంపైర్లు మరి కొద్ది సేపటిలో పిచ్ ఇన్స్ పెక్ట్ చేసి…మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ప్రకటించే అవకాశం ఉంది. అయితే వర్షం ఆగిందని పిచ్ పై కప్పిన కవర్లను ఇలా తీసేశారో లేదో అలా మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమయ్యేదీ చెప్పలేని పరిస్థితి నెలకొంది.

వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు నాటింగ్ హామ్ లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ రోజు మ్యాచ్ జరిగే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉదయం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉండటంతో మైదానం చిత్తడిగా మారింది. పలు చోట్ల నీరు నిలిచింది. దీంతో ప్రాక్టీస్ సెషన్ కూడా జరగలేదు. నాటింగ్ హామ్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, వర్షం తగ్గే అవకాశం కూడా ఉంది. దీంతో నేటి మ్యాచ్ కాస్తంత ఆలస్యంగానైనా ప్రారంభమవుతుందన్న ఆశతో అభిమానులు ఉన్నారు. కాగా, ఇప్పటికే మూడు మ్యాచ్ లాడిన న్యూజిలాండ్ మూడు విజయాలతో ఆరు పాటింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, ఇండియా రెండు మ్యాచ్ లాడి, రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఉంది. మ్యాచ్ పూర్తిగా రద్దయితే అది న్యూజిలాండ్ కే లాభిస్తుందని భావిస్తున్నారు.