జగన్ తో కుమారస్వామి తనయుడు నిఖిల్‌ గౌడ భేటీ

వాస్తవం ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ గౌడ మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళ వారం ఆయన ముఖ్య మంత్రి నివాసానికి రాగా, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సాదరంగా స్వాగ తించారు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటిం చారు. కాగా, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని నిఖిల్‌ ఈ సందర్భంగా చెప్పారు. యువ ముఖ్యమంత్రి ఏపీ రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయబోతున్నారని వెల్లడించారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజమేనని, అయితే, వాటిని పట్టించుకోకుండా అభివృద్ధిపై దృష్టిపెట్టడం ద్వారా ప్రజలతో మమేకం అవ్వొచ్చన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని, ఆయన పరిపాలనలో ఏపీ మరింత పురోభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య లోక్‌సభ స్థానం నుండి పోటీచేసిన నిఖిల్‌ ఓటమి పాలయ్యారు. మండ్యలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సుమలత అంబరీష్‌ నిఖిల్‌పై గెలుపొందారు.