ఇది చారిత్రక విజయం: ఎల్కే అద్వానీ

వాస్తవం ప్రతినిధి: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాల పట్ల సీనియర్ నేత ఎల్కే అద్వానీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది నిజంగా చారిత్రక విజయం అని అభివర్ణించారు. ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్ లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న అద్వానీ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చారిత్రాత్మక రీతిలో బీజేపీకి, దాని మిత్ర పక్షాలకు మద్దతు ఇచ్చారని, ఇవాళ ప్రజల తీర్పు పట్ల ఎన్డీయేలోని ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నారని తెలిపారు. కాగా, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం, నరేంద్ర మోదీ నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకోవడం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ నేత ఎన్నిక కార్యక్రమంలో కూడా ఇదే సీన్ పునరావృతమైంది. మోదీ మరోసారి బీజేపీ కురువృద్ధుడి దీవెనలు అందుకున్నారు.