చంద్రబాబు ఐదేళ్ల పాలన రూ. 2.57 లక్షల కోట్లకు పైగా అప్పుల మయం: జగన్

వాస్తవం ప్రతినిధి: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 2.57 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. రాష్ట్రానికి అన్నిరకాల సాయం కావాలని ప్రధానిని కోరామన్నారు. ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని సానుకూలంగా ఉన్నారనుకుంటున్నానన్నారు.విశ్వసనీయత సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం భేటీ జరిగిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ మద్దతుగా నిలుస్తామన్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. 2024 నాటికి మద్యపాన నిషేధం చేశాకే మళ్ళీ ఓట్లు అడుగుతామన్నారు. మద్యపాన నిషేధం అన్నది ఒక్కసారిగా అమలయ్యేది కాదని దశలవారీగా నిషేధం విధిస్తూ చివరికి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేసి 2024లో మళ్ళీ ప్రజల మద్యకు వచ్చి ఓట్లు అడుగుతామన్నారు.