భక్తజన సంద్రమైన తిరుమల.. శ్రీవారి సర్వ దర్శనానికి 26 గంటల సమయం

వాస్తవం ప్రతినిధి: తిరుమల భక్తజన సంద్రమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు సమయం దగ్గర పడటంతో, తమ మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో ఏడు కొండలూ కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా, ఆపై నారాయణగిరి ఉద్యానవనం దాటి, రెండు కిలోమీటర్లకు పైగా భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. వీరికి స్వామివారి దర్శనం చేయించేందుకు కనీసం 26 గంటలు పడుతుందని టీటీడీ అధికారులు వ్యాఖ్యానించారు. మరో రెండు వారాల పాటు ఇదే విధమైన రద్దీ ఉండవచ్చని అంచనా వేసిన అధికారులు, స్వామి దర్శనం కోసం వేచివున్నవారికి అన్నపానీయాలు అందిస్తున్నామని తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన వారికి దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లున్నవారికి 3 గంటల సమయం పడుతోందన్నారు.