రాజధాని భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగింది.. శ్వేతపత్రాలు విడుదల చేస్తా: వైఎస్ జగన్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన అనంతరం ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ..రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారన్నారు. రాజధానిలో భూముల్ని ఇష్టారీతిలో బినామీలకు కట్టబెట్టారన్నారు. నచ్చిన వారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారన్నారు. ల్యాండ్ పూలింగ్ లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారన్నారు. మా ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందన్నారు. రాష్ట్ర పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని, ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సమీక్షల తర్వాతే శ్వేతపత్రాలు విడుదల చేస్తామని అన్నారు.