ఇంకొంచెం ముందుగా ప్రచారం నిర్వహించినట్టయితే విజయం సాధించేవాడిని: పీవీపీ

వాస్తవం ప్రతినిధి: విజయవాడ నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన పొట్లూరి వర ప్రసాద్ (పీవీపీ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను గెలిచినా, ఓడినా ఎప్పటికీ విజయవాడ వాసినేనని అన్నారు. ఇకపై విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికలో తన ఓటమి గురించి ఆయన ప్రస్తావిస్తూ, ప్రచారం నిమిత్తం కేవలం పందొమ్మిది రోజులు మాత్రమే తిరిగానని, ఇంకొంచెం ముందుగా ప్రచారం నిర్వహించినట్టయితే విజయం సాధించేవాడినని అన్నారు. ఏపీలో వైసీపీ విజయం సాధించడంపై పీవీపీ స్పందిస్తూ 130 స్థానాలకు పైగా తమ పార్టీ గెలుస్తుందని తాను ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదని అన్నారు