రజినీకాంత్ సినిమాలో బాలీవుడ్ హీరో..!

వాస్తవం సినిమా: ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాలు కేవలం సౌత్లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలోనూ విడుదలవుతుంటాయి. రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ బట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రజిని సినిమాలు చాలా వరకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల రజనీకాంత్ నటించిన చాలా సినిమాలు బాలీవుడ్ లో విడుదల అయ్యి సంచలనాలు సృష్టించాయి. ఇంతగా తన సినిమాలకు బాలీవుడ్లో ఆదరణ కలగడంతో రజనీకాంత్ కూడా తన సినిమాలలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉండేలా చూసుకుంటున్నారు. ఇందుమూలంగా నే రజనీకాంత్ నటించిన చివరి మూడు సినిమాలలో బాలీవుడ్ నటులు ప్రతినాయక పాత్రల్లో కనిపించడం జరిగింది.

కాగా… ప్రస్తుతం రజినీ, పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కలయికలో రూపొందుతున్న ‘దర్బార్’లో కూడా విలన్ పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుణ్ణి ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే… పలు హిందీ సినిమాల్లో హీరోగా మెప్పించి… ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తున్న సీనియర్ హీరో సునీల్ శెట్టి… ఇప్పుడు రజినీ సినిమాలో స్టైలిష్ విలన్‌గా దర్శనమివ్వనున్నాడని టాక్. బిజినెస్‌మ్యాన్‌గా కనిపిస్తూ… రజినీని ఢీ కొట్టే పాత్రలో ఈ బాలీవుడ్ నటుడు నటించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు జూలై నెలలో జరగబోయే చిత్రీకరణలో సునీల్ శెట్టి పాల్గొంటాడ‌ని సమాచారం. కాగా… సునీల్ శెట్టి ఎంట్రీపై క్లారిటీ రావ‌ల్సి ఉంది.