జగన్‌కి ఇంత మెజార్టీ వస్తుందని ఎవరూ ఊహించలేదు: సీపీఐ నారాయణ

వాస్తవం ప్రతినిధి: జగన్‌కి ఇంత మెజార్టీ వస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రజల్లోకి జగన్ చొచ్చుకెళ్లారని, దాని ఫలితమే ఈ తీర్పు వచ్చిందన్నారు. జగన్‌కు తమ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీపీఐ నారాయణ.. మొదట మోదీని, చంద్రబాబు పొగిడినంతగా ఎవరూ పొగడలేదన్నారు. అందుకేనేమో ఇప్పుడు మోదీని ఎక్కువగా తిడుతున్నారని అన్నారు. ఎప్పుడైన రాజకీయ నాయకులు బ్యాలెన్స్‌గా ఉండాలని, ఆ విషయంలో బాబు ఫెయిల్ అయ్యారన్నారు. చంద్రబాబుకు మాటలు ఎక్కువ అయ్యాయని, ఆఖరికి తనను చూసి ఓటు వేయాలనే స్థాయిలో ప్రచారం చేసుకున్నారని గుర్తుచేశారు.

అలాగే.. ఎన్నికల్లో గెలిచినందుకు ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలిపారు సీపీఐ నారాయణ. ఈ ఫలితాల తర్వాతైన కమ్యూనిస్టులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఒకప్పుడు 60 సీట్లలో బలంగా వున్న కమ్యూనిస్టు పార్టీలు.. ఇప్పుడు నాలుగు స్థానాలకు పడిపోయారని వివరించారు.