చంద్రగిరి లో ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డ వైసీపీ కార్యకర్తలు

వాస్తవం ప్రతినిధి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 316 పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటర్లకు డబ్బులు పంచుతూ వైసీపీ కార్యకర్తలు చిక్కారు. డబ్బు పంచుతున్న వారిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో 19వ తేదీన రీ పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 316 పోలింగ్‌ బూత్‌ పరిధిలోని గణేశ్వరపురం, ఎన్‌ఆర్‌ యానాది కాలనీల్లో వైసీపీ కార్యకర్తలు ఓటుకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చొప్పున పంచుతున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి 26 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నగదు పంచిన ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేశామని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.