పోలింగ్ తరహాలోనే కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తాం: రజత్‌కుమార్

వాస్తవం ప్రతినిధి: పోలింగ్ తరహాలోనే కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 35 కౌంటింగ్ కేంద్రాల్లో మూడువేల టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కో టేబుల్‌కు నలుగురు సిబ్బంది ఉంటారని, నిజామాబాద్ కౌంటింగ్ కేంద్రంలో టేబుల్‌కు ఆరుగురు ఉంటారన్నారు. మల్కాజ్‌గిరిలో అదనపు టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 20వేల సిబ్బంది లెక్కింపులో పాల్గొంటారు. లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశాం. పోలింగ్ తరహాలో కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్‌లలోని స్లిప్పులు లెక్కిస్తాం. లాటరీ తీసి ఐదు వీవీప్యాట్ యంత్రాలను ఎంపిక చేస్తాం. ఫలితాలకు సాధారణం కంటే 2 గంటలు అదనపు సమయం పట్టవచ్చు. సాయంత్రం లోపే పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. ఈవీఎం, వీవీప్యాట్‌లతో తేడా ఉంటే వీవీప్యాట్ స్లిప్పులనే పరిగణలోకి తీసుకుంటామన్నారు. లెక్కింపు కేంద్రం వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే క్రిమినల్ కేసుల నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫలితాలు పూర్తిగా వెలువడే వరకు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని రజత్ కుమార్ తెలిపారు.