జగన్ తో భేటీ అయిన రమణ దీక్షితులు

వాస్తవం ప్రతినిధి: తిరుమల తిరుపతి దేవస్ధానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసి చంద్రబాబు సర్కారు చేతిలో తీవ్ర అవమానానికి గురైన రమణ దీక్షితులు తనను తొలగించిన టీడీపీ సర్కారుపై ఏకంగా యుద్ధాన్నే ప్రకటించారు. దీక్షితులు గురువారం జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం జగన్ పులివెందుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే కాగా ఆయనతో భేటీ అయ్యేందుకు దీక్షితులు కూడా పులివెందులకే వెళ్లారు. జగన్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు వెళ్లిన దీక్షితులు… జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

 టీడీపీ పాలనలో టీటీడీలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి దీక్షితులు జగన్ తో చర్చించినట్లు సమాచారం. టీటీడీ వ్యవహారాలపై న్యాయస్థానాల వేదికగా పోరాటం చేస్తున్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామికి కూడా అవసరమైన మేర ఆధారాలను అందించారు. మొత్తంగా టీడీపీ హయాంలో టీటీడీలో చోటుచేసుకున్న అక్రమాల గుట్టు మొత్తాన్ని దీక్షితులు… జగన్ చేతిలో పెట్టినట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి.మరోవైపు సర్వేలన్నీ చెబుతున్నట్లుగా జగన్ అధికారంలోకి వస్తే… దీక్షితులు తిరిగి తన స్థానాన్ని దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.