ఆన్‌లైన్లో జవాబు పత్రాలు.. ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు

వాస్తవం ప్రతినిధి: ఇంటర్‌ పరీక్షల్లో తప్పిన అభ్యర్థులందరి ఫలితాలు, మార్కుల జాబితాలతోపాటు జవాబు పత్రాలను కూడా ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలంటూ ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు సూచించింది.

ఈ నేపధ్యంలో ఇంటర్‌ విద్యార్థుల జవాబు పత్రాలను మే 27వ తేదీలోపు వెబ్‌సైట్‌లో పెట్టాలని, గ్లోబరీనా సంస్థకు నోటీసులు ఇచ్చి జూన్‌ 6న కోర్టు హాజరు కావాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రజా ఉద్యమానికి బలం చేకూర్చాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వ నిర్వాకానికి చెంపపెట్టని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిచే విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మీద బేరసారాలు చేయొద్దని హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తాత్సారం చేయకుండా విద్యార్థులకు ఎక్స్‌గ్రేషియా తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల తర్వాతనైనా సీఎం కేసీఆర్‌ స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.