మోడీపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డ మమతా బెనర్జీ

వాస్తవం ప్రతినిధి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీని ఒక సైతాన్ గా అభివర్ణించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒక గూండా అని విమర్శించారు.బీజేపీ విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చి బెంగాల్ గౌరవాన్ని దెబ్బతీసిందని దుయ్యబట్టారు. విద్యాసాగర్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టిస్తామంటున్నారు మోడీ…ఆ విగ్రహం తయారు చేసుకోవడానికి మావద్ద డబ్బులున్నాయి, అయితే 200 సంవత్సరాల వారసత్వాన్ని మోడీ మళ్లీ తీసుకురాగలరా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. మథురాపూర్ లో ఆమె మాట్లాడుతూ బీజేపీ గూండాలు దాడులు చేస్తూ మాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం మోడీ సభ తరువాత మేం ప్రచారం చేయడానికి వీల్లేదని పేర్కొందని మమత అన్నారు. ఈసీ అలా కాకుండా మరోలా వ్యవహరిస్తుందని తాము అనుకోవడం లేదని, ఎందుకంటే బీజేపీకి ఈసీ తమ్ముడిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇలా చెప్పడానికి బాధగా ఉన్నా…ఇంకేం చెప్పడానికి లేదనీ, ఈసీ తీరు అలాగే ఉందన్నారు. నిజం చెప్పడానికి తనకు భయం లేదనీ, నిజం మాట్లాడినందుకు జైలుకు పంపించినా సిద్ధమేనని మమతా బెనర్జీ అన్నారు.