ఠాణా ఎదుట బైఠాయించి ధర్నా కు దిగిన నరేంద్రమోదీ సోదరుడు

వాస్తవం ప్రతినిధి:వ్యక్తిగత భద్రతాసిబ్బందికి ప్రత్యేక వాహనం కేటాయించాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ మంగళవారం ధర్నా చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. జైపూర్‌-అజ్మేర్‌ జాతీయ రహదారి మార్గంలోని బగ్రు పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

భద్రతా కారణాల రీత్యా ప్రహ్లాద్‌ మోదీకి ఇద్దరు పీఎస్‌వో(వ్యక్తిగత భద్రతా అధికారులు)లను కేటాయించారు. నిబంధనల ప్రకారం.. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రహ్లాద్‌తో పాటు ఒకే వాహనంలో వెళ్లాలి. అయితే ఇందుకు ఆయన అంగీకరించలేదు. భద్రతా సిబ్బందిని తన వాహనంలో తీసుకెళ్లనని, వారికి ప్రత్యేక పోలీస్‌ వాహనం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దాదాపు గంట పాటు ప్రహ్లాద్‌ ఆందోళన సాగింది. అనంతరం పోలీసులు సర్దిచెప్పడంతో ప్రహ్లాద్‌ మోదీ భద్రతా సిబ్బందిని వెంట తీసుకుని వెళ్లిపోయారు.