ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చినా భయపడవద్దు అంటున్న చంద్రబాబు..!

వాస్తవం ప్రతినిధి: ఏపీలో పోలింగ్ అయిపోయిన తర్వాత జాతీయ రాజకీయాలలో కీలకంగా మారుతున్న చంద్రబాబు రాష్ట్రంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ టీడీపీ శ్రేణులను రాబోతున్న ఫలితాలకు అన్ని విధాలా రెడీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అసలు ఫలితాలు రాక ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ విషయంలో మంత్రులు కంగారు పడకూడదని ధైర్యంగా ఉండాలి చెప్పినట్లు సమాచారం. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎగ్జిట్ పోల్స్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు చంద్రబాబు ఈ మాటలు అన్నట్టు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. మే 19 వ తారీకు రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చినా గానీ కంగారు పడవద్దని బాబు సూచించారట.కచ్చితంగా టీడీపీ గెలవడం ఖాయం అని పేర్కొన్నారట. మోదీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అంశాలను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సీఎంకు వివరించారు. మోదీ విధానాలను జాతీయ స్థాయిలో పూర్తిగా ఎండగట్టలేకపోయారని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.ఎన్డీయేకు ఎట్టిపరిస్థితుల్లోనూ గెలుపు అవకాశాలు కన్పించడంలేదని చంద్రబాబు అనగా.. ఒకవేళ వచ్చినా మోదీని తప్పిస్తారనే ప్రచారం జరుగుతోందని ఓ మంత్రి సీఎం వద్ద అన్నట్టు ప్రచారం జరుగుతోంది.