బీజేపీ తన అసలు రంగు బయటపెట్టుకుంది..:బెంగాల్ దాడులపై చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: పశ్చిమ బెంగాల్ లో నిన్నటి నుండి అల్లర్లు, ఘర్షణలు జరుగుతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ అనుకూల పక్షాలు అక్కడ మమతా సర్కార్, టీఎంసిల ఓర్వలేని తనంగా విమర్శిస్తుంటే.. బీజేపీ వ్యతిరేక పక్షాలు మోడీ ప్రభుత్వం, బీజేపీ మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. టీఎంసీ నిన్న అమిత్ షా ర్యాలీని అడ్డుకోవడంతో రెచ్చిపోయిన బీజేపీ శ్రేణులు కొట్లాటకు దిగాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ విద్యార్థులను కూడా చితకబాదారు. దీనిపై దేశవ్యాప్తంగా నేతలు స్పందిస్తున్న క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. కోల్ కతాలో నిన్న జరిగిన హింసాత్మక సంఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ, దాని కార్యకర్తలు పెచ్చరిల్లిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

బీజేపీ అసలురంగు ఇప్పుడు బయటపెడుతూ ప్రత్యక్ష దాడులకు దిగుతుందని, నిన్నటివరకు సిబిఐ, ఈడీ, ఐటీ ద్వారా కుట్రలు చేశారని, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ఈ కుట్రలకు పాల్పడుతుందని, నిన్న బీజేపీ చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.