ఎన్నికల్లో హంగ్ గ్యారెంటీ.. మనమే డిసైడ్ చేస్తామంటున్న పవన్ కల్యాణ్..?

వాస్తవం ప్రతినిధి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుండి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాదని కచ్చితంగా హంగు ఏర్పడుతుందని..తాను చెప్పినట్టు జరిగితే కర్ణాటక రాష్ట్రంలో మొన్న జరిగిన విధంగా మనమే కింగ్ మేకర్ అవుతామని పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ సూచించారు. జనసేన పార్టీ మద్దతు లేనిదే రాబోయే రోజుల్లో ఏపీలో ఏ ఒక్కరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరని..సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భ‌వించిన పార్టీలు అభ్య‌ర్థుల‌ను కొనుగోలు చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తాయ‌ని, వాటి వ‌ల‌లో ప‌డొద్ద‌ని అన్నారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ సీపీల ప‌రిస్థితి అంతంత మాత్ర‌మేన‌ని చెప్పారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక గాలి వీచింద‌ని, దాని వ‌ల్ల త‌మ పార్టీ లాభ‌ప‌డిందంటూ ప‌లువురు అభ్య‌ర్థులు ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు చెబుతున్నారు. మొత్తం మీద రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు.