ఆ దేశంలోని ఎన్నారైలందరూ వెంటనే వెనక్కివచ్చేయండి: భారత విదేశాంగశాఖ

వాస్తవం ప్రతినిధి: లిబియాలో ఉన్న భారతీయుల్ని వెంటనే వెనక్కి రావాలంటూ విదేశాంగశాఖ కోరింది. లిబియాలో నెలకొన్న ఘర్షణల్లో అక్కడ పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తోంది. దీంతో.. లిబియా రాజధాని ట్రిపోలిలో 500 మందికి పైగా భారతీయులు ఉన్నారని.. వారందరిని వెంటనే వెనక్కి వచ్చేయాలని విదేశాంగ శాఖ కోరింది.

ప్రస్తుతం ట్రిపోలి నుంచి విమానాలు తిప్పుతున్నామని.. తర్వాతి రోజుల్లో విమానాల్ని తిప్పటం కష్టమవుతుందని.. అదే జరిగితే ఆ దేశం నుంచి మనోళ్లను వెనక్కి రప్పించటం ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. లిబియాలో ఉన్న భారతీయుల్ని.. వారి కుటుంబ సభ్యులు.. బంధువులు.. మిత్రులు వారిని వెంటనే వెనక్కి రావాలని కోరమని పిలుపునిచ్చింది. ఇప్పటివరకూ ఆ దేశంలో జరిగిన ఘర్షణల్లో సుమారు 200 మంది వరకూ ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. ఇలాంటివేళ.. మనోళ్ల కోసం విదేశాంగ శాఖ పడుతున్న తపన పలువురి అభినందనల్ని అందుకొంటోంది.