ఇసుక మైనింగ్ పై చంద్రబాబు అప్పనంగా రూ.16,000 కోట్లు మేశారు: బీజేపీ నేత సోము వీర్రాజు

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీతోనే జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.కేంద్రం కియా కంపెనీని ఏర్పాటుచేస్తే అది తానే తెచ్చానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని సోము వీర్రాజు విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో, రాయడంలో చంద్రబాబు చిత్రగుప్తుడని ఎద్దేవా చేశారు. ఆయన కుమారుడు లోకేశ్ మంగళగిరి అనే పదాన్నే సరిగ్గా పలకలేకపోతున్నారనీ, లోకేశ్ ఓ తింగరి మంగళం అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చం‍ద్రబాబు ఏపీని అవినీతి, తిరోగమనం వైపు విచ్చలవిడిగా నడిపారని మండిపడ్డారు. ఇసుక మైనింగ్ పై చంద్రబాబు అప్పనంగా రూ.16,000 కోట్లు మేశారని ఆరోపించారు.మట్టి, ఇసుక, పెన్షన్, ఇళ్లు ఇలా ప్రతి విషయంలో అవినీతికి పాల్పడి వేల కోట్లు తినేశారని ఆరోపించారు.