కోడెల 40 ఏళ్ల రాజకీయ జీవితం వంచన, నమ్మకద్రోహం, రౌడీయిజంలతో నిండిపోయింది: అంబటి రాంబాబు

వాస్తవం ప్రతినిధి: టిడిపి నేత కోడెల శివప్రసాద్‌ తన 40 ఏళ్ల రాజకీయ జీవితం వంచన, నమ్మకద్రోహం, రౌడీయిజంలతో నిండిపోయిందని వైకాపా నేత అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పోలింగ్‌లో రౌడీలతో కలిసి కోడెల రిగ్గింగ్‌ చేయడానికి వస్తేనే ప్రజలు తిరుగుబాటు చేశారని ఆయన చెప్పారు.

జేబుదొంగ దొరికినపుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో ఇడిమెట్లలో కోడెలను ప్రజలు అదే విధంగా ట్రీట్ చేశారని తప్పనిసరి పరిస్థితులలో పోలీసులు కోడెలపై కేసు రిజస్టర్ చేశారు తప్ప ఇప్పటికీ కోడెలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కోడెలపై అసలైన ప్రజాదాడి జరుగుతుందని అంబటి జోస్యం చెప్పారు.

ఎన్నికలు సక్రమంగా జరుగలేదని విమర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు 150 సీట్లు వస్తాయని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. అధికారం చేజారుతుందనే చంద్రబాబు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.అధికారం చేజారిపోనుందని చంద్రబాబుకి అర్థమైందని అందుకే ఈవీఎంలు, ఈసీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆపద్ధర్మ సీఎంగా ఉన్న చంద్రబాబు పోలవరంపై ఏ హక్కుతో రివ్యూ నిర్వహిస్తారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. రివ్యూ పేరుతో కమిషన్లు దండుకొనేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.