పబ్లిసిటీ కోసం మనుషులను చంపేస్తారా? సీరియస్ అయిన సునీల్..!

వాస్తవం సినిమా: గతంలో కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను నవ్వించినా సునీల్ తర్వాత హీరోగా అనేక సినిమాలు చేసి చేతులు కాల్చుకుని తిరిగి ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ తో నటించిన చిత్రాలహరి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో సునీల్ మాట్లాడుతూ ఇటీవల తన పై సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “సోషల్ మీడియా కారణంగా పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక వెబ్ సైట్ వాళ్లు .. రోడ్డు ప్రమాదంలో నేను చనిపోయానని రాసేశారు. ఆ వార్త వలన వాళ్లకి ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక మిలియన్ వ్యూస్ కోసం నన్ను చంపేస్తారా? ఇలాంటి వార్త కారణంగా ఆ ఇంట్లో వాళ్లు ఎంత బాధపడతారో తెలియాలంటే, ఇలాంటి వార్తను రాసినవారి కుటుంబ సభ్యులపై ఇలాంటి వార్త వచ్చినప్పుడే తెలుస్తుంది. ఏ వార్తనైనా నిజానిజాలు తెలుసుకుని రాస్తే బాగుంటుంది” అని చెప్పుకొచ్చాడు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ప్రజలను బ్రహ్మ పరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పబ్లిసిటీ కోసం బతికున్న మనుషులను చంపేస్తారా అంటూ సీరియస్ అయ్యాడు సునీల్.