న్యాచురల్ స్టార్ నాని ని చూసి నేను గర్వపడుతున్నా: విక్టరీ వెంకటేష్..!

వాస్తవం సినిమా: క్రికెటర్ గా న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమా వేసవి కానుకగా ఈ నెల 19వ తారీఖున విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు సినిమా యూనిట్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేష్ సినిమా యూనిట్ పై మరియు న్యాచురల్ స్టార్ నాని పై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ..అందరూ ప్రేమించే నాని అభిమానులకు స్వాగతం. నాకు క్రికెట్ ఇష్టం అని ఇక్కడకు రాలేదు. సినిమాని ప్రేమించే నేను ‘జెర్సీ’ ఫస్ట్‌ లుక్ చూసే ఇంప్రెస్ అయ్యా. ఆ తరువాత టీజర్, ట్రైలర్‌లతో రియల్ లుక్ తీసుకువచ్చారు. ముఖ్యంగా ట్రైలర్ మైండ్ బ్లోయింగ్. ఇలాంటి సినిమా అరుదుగా వస్తాయి. ఇలాంటి పాత్రలు చేయడం ద్వారా సినిమా నుండి బయటకు రాలేము. చాలా ఇన్వాల్వ్ అవుతాం. ప్రతి ఒక్కరు లైఫ్‌లో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కాని జీవితంలో వాటిని ఎదుర్కొని ఎలా నిలదొక్కుకున్నారన్నదాన్ని ‘జెర్సీ’లో నాని చూపించబోతున్నారు. ఈ సినిమా చూసిన తరువాత ఇదో జీవిత పాఠంలా అనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. నాని ఫ్యాన్స్ చాలా గర్వపడాలి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి నేచురల్ యాక్టర్ ఉన్నందుకు’ అంటూ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు వెంకటేష్.