ప్రజల కోసమే పోరాడుతున్నా: ప్రకాశ్ రాజ్

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ బెంగళూరు సెంట్రల్‌ లోక్‌ సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో..మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ.. తన పోరాటం ఏ ఒక్క వ్యక్తిపైనో కాదని, ప్రజల కోసమే తాను పోరాడుతున్నానని తెలిపారు. అభ్యర్థి ఏ పార్టీకి చెందిన వారన్న విషయం ముఖ్యం కాదని, సరైన నాయకుడా? కాదా? అన్న విషయాన్ని చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఒక పార్టీ ఏడాదికి రూ.72,000 అందిస్తామని అంటోంది, మరో పార్టీ రైతులకు రూ.6,000 ఇస్తామని చెబుతోంది. మన డబ్బునే పన్నుల రూపంలో తీసుకుని, ఓ స్వచ్చంధ సంస్థల్లా ఇస్తామని అంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతి పౌరుడి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఎమైందని ప్రశ్నించారు. అంతేగానీ, వారి మేనిఫెస్టోల్లో ప్రకటించిన అంశాల్లో ఓ విజన్‌గానీ, మంచి ఉద్దేశంగానీ లేదని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు.