తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పిన భారత వాతావరణ శాఖ

వాస్తవం ప్రతినిధి: తెలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది పుష్కలమైన వర్షాలుంటాయని చల్లని కబురు తెలిపింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల గురించి అంచనాలను వెలువరిస్తూ.. ఈ సారి వర్షాలు పుష్కలంగా ఉంటాయని ఐఎండీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఈ సారి వర్షాలు మంచి స్థాయిలో ఉంటాయని.. ఖరీఫ్ సీజన్ లో కరువు తీరా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది.

నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని.. అవి మంచి వర్షపాతాన్ని నమోదు చేయవచ్చని వాతావరణ శాఖ వివరించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ నైరుతి రుతుపవనాల ఫలితంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వివరించింది. ఇక మొత్తంగా చూసుకున్నా.. ఈ ఏడాది తొంభై ఆరు శాతం వరకూ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మొత్తానికి ఎండల వేడిమి మధ్యన ఇది చల్లని కబురే.