మెహబూబా ముఫ్తీ కాన్వాయ్ పై రాళ్ల దాడి.. సొంత నియోజకవర్గంలోనే!!

వాస్తవం ప్రతినిధి: సార్వ‌త్రిక ఎన్నిక‌ల సమయంలో జ‌మ్మూ, కాశ్మీర్ర్ మాజీ ముఖ్య‌మంత్రి మెహబూబా ముఫ్తీకి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌జ‌ల‌నుంచి చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. అది కూడా సొంత నియోజ‌క వ‌ర్గం కావ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. అనంతనాగ్ లోక్ సభ నియోజకవర్గంలో ఈరోజు పార్టీ కార్యకర్తలతో సమావేశమైన అనంతరం మెహబూబా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఖిరాం గ్రామంలో దర్గాను సందర్శించి బిజ్‌బెహరా పట్టణానికి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు ఆమె కాన్వాయ్ పై రాళ్ల వర్షం కురిపించారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించ‌గా….కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. దుండగుల బారి నుంచి ఆమెను కాపాడిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలింపు చేపట్టాయి. భద్రతా సిబ్బంది సాయంతో ఆమె బిజ్‌బెహరా పట్టణానికి చేరుకుని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మెహబుబా ముఫ్తీ అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.