జయప్రదపై ఆజంఖాన్‌ అసభ్యకర వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాంపూర్‌నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమె ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కాగా తన ప్రసంగంలో జయప్రద పేరును ప్రస్తావించలేదని ఆజంఖాన్‌ అన్నారు. ఆమె పేరు తాను ప్రస్తావించినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన చెప్పారు.

నియోజకవర్గంలో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆజంఖాన్‌ జయప్రదపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ‘జయప్రదను రాంపూర్‌ తీసుకువచ్చింది నేను, ఇక్కడి వీధుల్లో ప్రజలకు పరిచయం చేసింది నేను, ఆమె జోలికి ఎవరూ రాకుండా చూసుకున్నది నేను. కానీ ఆమె నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. ఆమె ఖాకీ నిక్కరు వేసుకుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల్లో ఆమె ఖాకీ నిక్కరు వేసుకున్నారన్న వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఒక మహిళను కించపరుస్తూ ఆయన మాట్లాడారని పలువురు దుమ్మెత్తిపోశారు. మహిళా కమిషన్‌ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి ఈసీకి లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించిన ఎన్నికల సంఘం ఆజంఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.