మో“ఢీ” ని “ఢీ” కొట్టబోతున్న ప్రియాంక..!!!

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీకి మోడీ పేరు చెప్తే చాలు అరికాళ్ళ నుంచీ వణుకు మొదలవుతోంది. సోనియా గాంధీ రాహుల్ కి పట్టం కట్టడంతోపాటు తానూ రెస్ట్ తీసుకోవాలని అనుకుని రాహుల్ ని ముందు పెట్టి వెనుక నుంచీ పర్యవేక్షణ చేయాలని అనుకున్నారు. కానీ రాహుల్ పెర్ఫార్మెన్స్ చాలా తక్కువ సమయంలోనే అర్థం చేసుకున్న సోనియా గత కొంత కాలంగా తీవ్రంగా మధన పడుతున్నారట. రాహుల్ ని కాదని ప్రియాంక ని ముందుకు తీసుకురాలేరు, అలా అని రాహుల్ గాంధీ పై నమ్మకం ఉంచలేరు ఈ క్రమంలోనే సోనియాకి ఎన్నికలు రావడం ఎంతో కలిసొచ్చిన అంశంగా చెప్తున్నారు. అందులో భాగంగానే సోనియా ప్రియంకని తెరపైకి తీసుకువచ్చారనే విషయం అందరికి తెలిసిందే.

తాజా రాజకీయ పరిణామాల్ని పరిశీలిస్తే. కాంగ్రెస్ పార్టీలో ఫుల్ యాక్టివ్ అయిన ప్రియాంక వాద్రా ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి కూడా దిగుతారనే విషయం సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్న రాహుల్ గాంధీ ఒక్కడికే ఇది సాధ్యం కాదని గ్రహించి ప్రియాంకాని బరిలోకి దింపారు సోనియా. ఈ సారి ప్రియాంక ఛరిష్మా తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందని కాంగ్రెస్ వాళ్లు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

అయితే నేతల నమ్మకానికి మరింత నమ్మకాన్ని ఇచ్చేలా ప్రియాంకా గాంధీ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోడీ పై ఎన్నికల్లో పోటీ కి సైతం సై అంటున్నారట ప్రియాంక. ఈ సారి కూడా మోడీ వారణాసి నుంచి పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో, ఆయన మీద తానూ పోటీ చేయడానికి గౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. కార్యకర్తలతోనే ఆమె ఈ విషయాన్ని నేరుగా చెప్పడంతో ఇక ప్రియాంక మోడీ ల సమరం ఫిక్స్ అయినట్టే అంటున్నారు పరిశీలకులు.

ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్స్ మాత్రం అవన్నీ పుకార్లేనని , తాము నమ్మమని ఒకవేళ ప్రియాంక గనుక పోటీ చేస్తే ఆ విషయం అధికారికంగా వస్తుంది తప్ప ఇలా ప్రకటనలు కాంగ్రెస్ పార్టీలో ఉండవని అది అందరికి తెలిసిన విషయమేనని అంటున్నారు. మరి మీడియాలో సైతం విశ్వవ్యాప్తం అయిన ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు తమకేమి తెలియదనేట్టుగా వ్యవహరించడంతో ప్రియాంక పోటీ పై మరిన్ని అనుమానాలని రేకెత్తిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. ఒక వేళ అదే జరిగితే పాపం రాహుల్ గాంధీ ఆటలో అరటిపండు అవుతాడేమో అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.