ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

వాస్తవం ప్రతినిధి: ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 13 నుండి 22వరకు జరగనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాలు, కళ్యాణవేదిక వద్ద వడగండ్లు, ఈదురుగాలులను తట్టుకునేలా జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, ఎండవేడిని తట్టుకునేలా చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయ గోపురాలు, కళ్యాణవేదిక, ఇతర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్‌ దీపాలు, విద్యుత్‌ కటౌట్లతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కౌంటర్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 18వ తేదిన జరగనున్న శ్రీసీతారాముల కళ్యాణానికి వేలాదిమంది భక్తులు విచ్చేసే అవకాశముండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. అన్నప్రసాద వితరణ కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. కళ్యాణానికి వైద్య శిబిరాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలను వినియోగించుకోనున్నారు. కళ్యాణాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు భక్తులందరూ వీక్షించేందుకు వీలుగా హెచ్‌డి డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. రేడియో, బ్రాడ్‌ కాస్టింగ్‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు ప్రకటనలు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

వైభవంగా అంకురార్పణ
ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 13 నుండి జరగనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటలవరకు అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.