సమస్యాత్మక ప్రాంతాలలో సాయంత్రం 4 వరకు పోలింగ్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6గంటలవరకు పోలింగ్ జరగనుంది. అయితే విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో అక్కడ సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది.

కాగా ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో బరిలో 2,118 మంది అభ్యర్ధులు ఉన్నారు. 25 లోక్‌సభ నియోజకవర్గాల బరిలో 319 మంది అభ్యర్ధులు ఉన్నారు. ఏపీలో 3కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాలు-45,920 ఏర్పాటు చేయగా…వాటిలో 9 వేలు సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. తొలిసారిగా 10 లక్షల మంది యువత ఓటు వేయనున్నారు. అలాగే 5,323 మంది ప్రవాసాంధ్రులు ఓటు వేయనున్నారు. ఎన్నికల సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.