ఏపీ చరిత్రలో అత్యధిక పోలింగ్..ఎవరికి కలిసొస్తుందంటే..???

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఎంతో ఉత్ఖంటగా ఎదురు చూస్తున్నారు. ఒక పక్క అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ మరో సారి అధికారం కోసం తహతహలాడుతుంటే ఇంకో పక్క వైసీపీ అధినేత జగన్ ఈ సారి ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకుని తీరాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే ఏపీలో కింగ్ మేకర్ అవ్వాలని నిశ్చయించుకున్నారు. ఇక మిగిలిన పార్టీల గురించి పక్కన పెడితే, ప్రధానంగా పోటీ ఈ మూడు పార్టీల మధ్యనే తిరుగుతోంది.

అయితే ఎన్నడూ లేనంతగా ఎంతో భారీ స్థాయిలో ఈ సారి ఎన్నికల పోలింగ్ ఉండబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నెల రోజుల క్రితం వరకూ కూడా వార్ వన్ సైడ్ గా వైసీపీ వైపుకి బలంగా గాలి ఉందని అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ ఓటర్లని ఏ మార్చిన బాబు ఓటర్లని చీల్చడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఎవరు ఎవరికీ ఒటేస్తారు అనేది ప్రధానమైన అంశం. ఇదిలాఉంటే.

ఈసారి ఏపీ ప్రజలు సైతం భారీ స్థాయిలో తాము కోరుకున్న పార్టీకి ఓటేయడానికి సిద్ధమయ్యారట. ఉమ్మడి ఏపీ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 11న జరగబోతోందని తెలుస్తోంది. జనాలు కూడా ఈ ఉత్కంఠ పోరులో ఎవరిని గెలిపించాలనే దానిపై ఎంతో ఆసక్తిగా ఉన్నారట. ఎప్పుడూ 80శాతం దాటని ఏపీ పోలింగ్ ఈసారి 80శాతానికి పైగా చేరినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎందుకంటే..

 

ఇప్పటికే ఏపీలో ఓటు హక్కు ఉన్న వివిధ రాష్ట్రాలు, తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరూ ఏపీలో తమ తమ సొంత ఊళ్ళకి బైలెల్లి పోయారు. తమకు నచ్చిన పార్టీకి ఓటేసేందుకు అన్నీ దారులు ఏపీ వైపుగా సాగుతున్నాయి. దాంతో ఈ ఎన్నికల్లో పోలింగ్ అత్యధికంగా నమోదవడం పక్కా అని అంటున్నారు. అంతేకాదు ఏపీలో తప్పకుండా మార్పు రావాలని ఒక్క సారి జగన్ కి అవకాశం ఇచ్చే చూస్తే ఏమవుతుంది అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారట. దాంతో తమ ఓటు మురిగిపోకుండా తమ సొంత ఊళ్ళకి వెళ్లి మరీ ఓటు వేయడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సారి అత్యధిక పోలింగ్ గనుకా జరిగింటే వైసీపీ గెలుపు ఖాయం అంటున్నారు విశ్లేషకులు.