ఓటు వేయడానికి సొంతూళ్లకు వెడదామనుకున్న ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్

వాస్తవం ప్రతినిధి: ఎన్నికల వేళ ఓటు వేయడానికి సొంతూళ్లకు వెడదామనుకున్న ఏపీ ప్రజలకు దిమ్మదిరిగే షాకింగ్ న్యూస్. ఏపీకి వెళ్లే వందల ప్రైవేట్ ట్రావెల్ బస్సులు రద్దయ్యాయి. చివరి నిముషంలో రద్దు విషయం చెప్పి డబ్బులు వాపస్ ఇస్తామంటూ సదరు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణీకులకు మెసేజ్ లు పంపి చేతులు దులిపేసుకున్నాయి. ఓటేయడానికి సొంతూళ్లకు వెళ్లడానికి ముందుగానే ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో టికెట్ లు రిజర్వ్ చేసుకున్న ఆంధ్రా జనం ఇప్పుడేం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా వందల బస్సులు రద్దయ్యాయి. పదవ తేదీన వెళ్లాల్సిన 125 బస్ సర్వీసులకు ఒక ట్రావెల్స్ ఏజెన్సీ రద్దు చేసింది. అలాగే వివిధ ట్రావెల్ ఏజెన్సీలకు చెందిన మరో వంద బస్సులు కూడా రద్దయ్యాయి. ఇందుకు కారణం ఆ ఏజెన్సీలకు ఏపీ- తెలంగాణల్లో బస్సులు నడిపే లైసెన్స్ లేదనీ, కేవలం ఏపీలోనే సర్వీసులు నడుపుకోవాలని తెలంగాణ ఆర్టీఏ ఆదేశాలు జారీ చేయడంతో అవి రద్దయ్యాయి. ప్రయాణీకులు మాత్రం ఇది కుట్రే అని, ఏపీ ఎన్నికలలో అధికార పార్టీకి నష్టం చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఏపీ విపక్ష నేత, తెలంగాణ ముఖ్యమంత్రి కలిసి పన్నిన వ్యూహమని విమర్శిస్తున్నారు.