ఐ యామ్ బ్యాక్ అంటున్న బ్రహ్మానందం…!

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో బ్రహ్మానందం లేనిది సినిమా ఉండేది కాదు. అంతగా తెలుగు సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం గత కొంత కాలం నుండి సినిమాలకు దూరమయ్యారు. ఇదే క్రమంలో ఇటీవల అనారోగ్యం పాలవడంతో బ్రహ్మానందం కుటుంబ సభ్యులు ఆయనని ముంబాయి నగరంలో చికిత్స చేయించి హైదరాబాద్ నివాసానికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో చాలా కాలం సినిమాలకు దూరమైన బ్రహ్మానందం తాజాగా సినిమాలో నటిస్తున్నట్లు అది కూడా హీరోగా చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. సినీ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం ప్రకారం ‘బ్రహ్మి ఈజ్ బ్యాక్!’ అనే సినిమాలో బ్రహ్మానందం నటించబోతున్నారు. రచయిత శ్రీధర్ సీపన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం రా ఏజెంట్‌గా కనిపిస్తారట. ఇంతకీ ఈ సినిమాలో బ్రహ్మి పోషించేది కమెడియన్ పాత్ర కాదు.. హీరో. రా ఏజెంట్‌గా తెలుగు ప్రేక్షకులను బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైపోతున్నారని సమాచారం. మొత్తం మీద మరొకసారి వెండితెరపై కనువిందు చేయడానికి ఐ యామ్ బ్యాక్ అంటున్నారు బ్రహ్మానందం.