‘ఉగాది’ విశిష్టత

వాస్తవం ప్రతినిధి: ఉగాది. నూతన తెలుగు సంవత్సరంలో మొదటి రోజు. దీనినే యుగాది అని కూడా పిలుస్తాం. అంటే సృష్టి ప్రారంభం జరిగిన రోజు అన్నమాట. మనుష్యుడు ఉపాసన చేసి భగవంతుని పొందటానికి వీలుగా కాలాన్ని విభాగం చేశాడు. అందులో ముఖ్యమైనది సంవత్సరము. ఈ సంవత్సరము 12 మాసాలతో కూడి వుంటుంది. అందులో మొదటి మాసం చైత్రంలో, మొదటి పక్షం శుక్ల పక్షంలో మొదటి తిధి అయినటు వంటి పాడ్యమి నాడు మన తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అలాగే చాంద్ర మానాన్ని అనుసరించి మనకి 60 సంవత్సరాలు, ఒక వృత్తంలో అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం మనకు రాబోయేది వికారి నమ సంవత్సరం.

మన ఋషులు క్రొత్త సంవత్సరం ప్రారంభం అయినప్పుడు దాన్ని అనుష్టించి, తత్సభందమైన ప్రయోజనాలను పొందటానికి,కావలసిన రీతిని నిర్ణయించినారు. దానిని అనుసరించి మనం ఒక ప్రత్యేకమైన విధానంలో ఉగాది వేడుక జరుపుకోవాలి. కొత్త సంవత్సరాది నాడు విధింపబడిన ప్రధమ కర్తవ్యం ప్రాత: కాలం లో స్నానం చేయడం. మనకు రోజుకు 24 గంటలు మరియు 3 గంటలతో కూడిన 8 యామములు వుంటాయి. సూర్త్యోదయానికి పూర్వం, ప్రధమ యామంలో అంటే బ్రంహీ ముహూర్తం లోనే స్నానం చేయాలి. అదికూడా అభ్యంగన స్నానం చేయాలి. అంటే తల మొదలు పాదాల వరకు నీరు పోసుకొని స్నానం చేయడం. దీన్నే తలంటు స్నానం అంటారు. ఇలా అభ్యంగన స్నానం చేసే ముందర ఇంటిలోని పెద్దల చేత తల మాడు మీద నువ్వుల నూనె పెట్టించుకొని ఆశ్విర్వచనం చేయించుకోవాలి. ఇలా తైలాభ్యంగన స్నానం చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది అని నమ్మకం. ఇంటిలో ఆకలి, దప్పిక మరియు మలినం వుండకూడదు అని లక్ష్మీ దేవి కంటే ముందు పుట్టిన జేష్టా దేవి స్వరూపం అంటే దారిద్ర్యం తొలగి పోవాలి అని.

తైలాభ్యంగన స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములు ధరించాలి. అంచు కలిగినటువంటి బట్ట కట్టుకోవాలి. అంచు కలిగిన సమస్త దేవతలు ఆవహించి వుంటారు అని వేదం వాక్కు. నూతన వస్త్ర ధారణ తరువాత కుల దైవానికి నమస్కరించాలి. నేను స్నేహితులతోను, బందువుల తోను, సిరి సంపదలు, వస్తు వాహనాలతోను ఆరోగ్యవంతంగా సంతోషంగా జీవించునట్లు అనుగ్రహించమని శ్రీసూక్త పథనం చేయాలి. అటుపిమ్మట ఈశ్వరుడుకి నివేదన చేసినటువంటి ప్రత్యేక ప్రసాదం యెక్క శేషాన్ని పుచ్చుకోవాలి.

ఈ ప్రత్యెక పదార్ధాన్ని కూడా ఎలా తయారు చెయ్యాలో శాస్త్రం చెప్పింది. దీన్నే మనం ఉగాది పచ్చడి అంటాం. దీన్ని ఒక్కొక్క ప్రాతంలో ఒక్కో విధంగా తయారు చేస్తారు. వేప పువ్వు ఈ ప్రసాదంలో ప్రధానంగా వుండాలి. అమరకోశంలో వేపచెట్టు ప్రాశస్త్యాన్ని వివరించబడింది. వేప చెట్లని ఆశ్రయించడం, వాటి కింద పడుకోవడం, వాటి గాలి పీల్చడం ఆరోగ్యానికి పరమ కారణం అవుతుంది. చైత్రమాసంలో వేప చెట్లు ఇగురించి, పూలు పూచి వుంటాయి. ఈ పోవ్వులో రోగ నిరోధక శక్తి, క్రిమి సంహారక శక్తి వుంటుంది. అటువంటి దాన్ని నీళ్లలో కలుపుతాం అలానే బెల్లం కూడా కలుపుతాం. బెల్లానికి నిలువ దోషం లేదు. ఎంత కాలం నిలువ వున్నా అది పరిగణలోకి రాదు. బెల్లం మంగళద్రవ్యం. భగవంతునికి నివేదన చేసే ప్రసాదంలో బెల్లం తప్పక వుంచుతారు. ఆలానే కొత్త చింతపండు పులుసు కలుపుతారు. వేప పువ్వు సారం, బెల్లం మరియు చింతపండు రసం కలిపి మిశ్రమం తయారు చేసి దానిలో ఆవు నెయ్యి కలపాలి. వేదం మూడింటిని అమృతంతో సమానంగా చెప్పింది. అందులో ఆవునెయ్యి ఒకటి. తరువాత ఈ మిశ్రమం లో మామిడి కాయ ముక్కలు కలుపుతారు. హిరణ్యకశిపుని వధ సమయంలో ఆ రాక్షసుని తన గోళ్ళతో పేగులు చీల్చి వధించిన కారణం చేత లక్ష్మీ నృసింహస్వామికి గోళ్ళు విషపూరితమై భరింపరాని మంట పుట్టిందట. ఆ సమయంలో లక్ష్మీ దేవి స్వామికి మామిడి పండ్ల రసం పూసి స్వాంతన చేకూర్చిందట. అందుకు స్వామి వారు సంతోషించి మామిడి చెట్టుకు అనేక వరాలు ఇచ్చారట. అందుకే మన ఇళ్ళలో ఈ మంగళకరమైన కార్యం జరిగినా మామిడి ఆకులతో తోరణాలు కట్టి ఆలంకరిస్తాం. అలానే మామిడి కాయలలో అనేక ఓషధి గుణాలు వున్నాయి. ఈ మిశ్రమానికి ఉప్పు మరియు పచ్చి మిరమకాయ ముక్కలు కలిపి షడ్రుచులతో కూడిన ప్రసాదాన్ని భగవంతునికి నివేదన చేస్తాం. ఈ ప్రసాదాన్ని మొదటి యామంలోనే స్వీకరించాలి. ఈ ప్రసాదం ఈశ్వరుడి అనుగ్రహం కనుక, స్వీకరించిన వ్యక్తికి ఆ సంవత్సరం కాలం ప్రశాతంగా జీవించడానికి కావలసిన వనరులను అందిస్తుంది అని నమ్మకం.

ఆరోజున క్రొత్తగా చేయించుకొన్న భూషణములు ధరించి రాజ దర్శనం చేయాలి. రాజు విష్ణువు అంశలోని వాడు. విష్ణు సమానుడని అర్ధం. లేదంటే రాజులకు రాజైన ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవాలి. శివాలయానికి వెళ్లి లోకానిని తల్లి, తండ్రులైన ఆ పార్వతీ మరమేశ్వరులను గానీ లేదా విష్ణు ఆలయానికి వెళ్లి లక్ష్మీ నారాయణులను గానీ దర్శించాలి. ఇంకా ఉగాది రోజు చెయ్య వలసిన కార్యక్రమాలలో తప్పక చేయవలసింది గోపూజ మరియు వృషభ పూజ. గోవుయందు సకల దేవతలు ఆవహించి వుంటారు. గోవు పృష్ట భాగానికి పూజ చేసి ప్రదక్షిణ చేసి గ్రాసాన్ని సమర్పించిన విశేషమైన ఫలితం వస్తుంది. అలానే వృషభ పూజ. ఎద్దుకు ముందు భాగంలో పూజ చేయాలి. ఎద్దు డెక్కల నుండి స్రవించే అమృతం నెల మీద పడి మంచి పంటలు పండుటకు, అనేక రోగ నివారణకు హేతువని నమ్మకం.

అలాగే ఆరోజు తప్పని సరిగా పంచాంగానికి పూజ చేయాలి. పంచాంగం అంటే తిధి, వారం, నక్షత్రం,కరణము, యోగము అని 5 అంగములు కలిగినది అని అర్ధం. ఈ పంచాంగం ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణంగా చేసుకొని, ఆ కాలము నందు గ్రహాలూ ఏవిధంగా కదులు తున్నాయూ, ఆయా గ్రహాలూ ఏవిధమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయో, దాని చేత ఆయా నక్షత్ర పాదముల యందు జన్మించినటు వంటి జాతకుల శుభా, శుభ ఫలితములు ఎలా వుంటాయో, ఆదాయ, వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు ఎలా వుంటాయో, ఇవన్ని తెలియ జేయబడతాయి. ఎందువలన అంటే గ్రహములకు స్వాతంత్రం లేదు. అవి ఈశ్వరుడికి వశవర్తి అయి వుంటాయి. రాబోవు కాలం ఇలా వుంటుంది అని తెలిస్తే, క్రుంగి పోకుండా భగవంతుని ఆరాదిస్తే , భక్త ప్రసన్నుడైన పరమాత్మ ఆయా గ్రహములను తీవ్ర మైన ఫలితములు ఇవ్వకుండా తట్టుకో గలిగిన మేరకే కష్టాలను ఇవ్వమని ఆ గ్రహములను ఆదేశిస్తాడు. ప్రతి రోజు పంచాంగం పరిశీలించుట వలన సంపద, దీర్ఘాయువు, పాపనాశనం, ఆయురారోగ్యాలు మరియు విజయం సంప్రాప్తిస్తాయి. అలానే కుటుంబ సభ్యులందరికీ వారి వారి రాశి ఫలితాలు చదివి వినిపించాలి. ఏవైనా చెడు ఫలితాలు సూచిస్తున్న యెడల, భగవంతుని పాదారవిందములు సేవించి, మరింత ధృడంగా, శక్తితో ఎటువంటి పరిస్థితుల నైనా ఎడుర్కొనగలడు. అలానే ఇంటిలోని పెద్దలకి, గురువుకి పూజించి నమస్కరించాలి. పండ్లు, పానకం లాంటివి పంచాలి. వేసవికాలం మొదలవుతుంది కనుక చలివేంద్రాలు పెట్టి పాదచారులకి, పశు పక్ష్యాదులకు చల్లని నీరు అందించడం ద్వారా విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ వికారి నామ సంవత్సర ఉగాదిని సుఖ, సంతోషాలతో జరుపుకోవాలని ఆశిస్తూ…..

అందరికి వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

( ప్రముఖ ప్రవచనకారుడు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం నుండి)