కాంగ్రెస్ పార్టీ ‘న్యాయ్ పధకం’ అమలు సాధ్యా సాధ్యాలు మరియు ఆర్ధిక వ్యవస్థ మీద దాని ప్రభావం !

వాస్తవం ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికల మొదటి దశ దగ్గర పడుతుండటంతో దేశంలో రాజకీయ వేడి పెరుగుతుంది. ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకొనేటందుకు రాజకీయ పార్టీలు మరియు నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే యావతో, సాధ్యా సాధ్యాల గూర్చి ఆలోచించకుండా ప్రజలకు ఇష్టం వచ్చినట్లుగా వరాల జల్లులు కురిపిస్తున్నారు. రాష్ట్ర, దేశ ఆర్ధిక పరిస్థితులను పట్టించుకోకుండా ఒక్కొక్క రాజకీయ పార్టీ వారి ఎన్నికల ప్రణాళికలలో అమలుకు సాధ్యం కాని హామీలు పొందుపరుస్తున్నారు.

ఆ కోవలోకి చెందినదే ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన న్యాయ్ (న్యూతమ్ ఆయ్ యోజన (Nyay) ) పధకం. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం లోనికి వస్తే ఈ కనీస ఆదాయ హామీ పధకం కింద భారత దేశం లో వున్న 20 శాతం అతి పేద కుటుంబాలకు నెలకు రూ. 6000 చొప్పున సంవత్సరానికి రూ.72000 అందజేస్తారట.

అంటే సంవత్సరానికి 3.36 లక్షల కోట్లు ధనం పేద కుటుంబాలకి అందజేస్తామని ఆయన తెలిపారు. దీనికోసం అయ్యే ఖర్చు భారతదేశ జాతీయ ఆదాయంలో 2 శాతానికి మించదని కాంగ్రెస్ అధ్యక్షులవారు మనవి చేసారు. కానీ దీనికి సంబంధించి విధి విధానాలను మాత్రం వారు స్పష్టంగా తెలియజేయలేదు. ఈ పధకం గూర్చి ప్రజలకు చూచాయగా తెలియ జేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాది కల్పన ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని అందరూ ఆశించారు. కానీ అలాంటిది ఏమి లేనట్లు తోస్తున్నది. దీని ద్వారా రెండు లక్ష్యాలు నెరవేరుతాయని రాహుల్ తెలిపారు. ఒకటి దేశంలోని 20 శాతం అతి పేద కుటుంబాలకు కనీస ఆదాయం చేకూర్చడం, రెండవది నోట్ల రద్దు వల్ల ప్రజలు కోల్పోయిన ధనాన్ని వారి వద్దకు చేర్చడం అని.

ఈ పధకం వినడానికి చాలా సొంపుగా వున్నా దీని అమలులో సాధ్యా సాధ్యాల గూర్చే ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుచున్నది. 20 శాతం పేద కుటుంబాలని ఏ పద్దతిలో ఎన్నుకొంటారు? పేద కుటుంబం అంటే ఈ పధకం కింద నిర్వచనం ఏమిటి? రూ. 6000 ఏ విధంగా అందజేస్తారు? నేరుగా లబ్ది దారుల బ్యాంకు ఖాతాలోనికి పంపుతారా? లేదా ఏదైనా ఉపాధి చూపించి అందజేస్తారా అనే దాని మీద స్పష్టత లేదు.ఈ పధకం కింద ఎన్ని రోజులు ఈ విధంగా డబ్బులు అందజేస్తారు? నేరుగా అందజేసినా అది ప్రజలను సోమరిపోతులను చేయడమే అన్నది నిపుణుల మాట. రూ. 6000 ఆదాయం లోపల ఉన్న వారిని వివిధ ప్రభుత్వ పధకాలలో ఏ విధంగా పేద వారిగా గుర్తిసారు? మరి సంవత్సరానికి రూ.72000 ఒక కుటుంబానికి అందజేస్తే వారు పేదవారు ఎలా అవుతారు? అదీకాక మరి ఇతర పధకాల మాట ఏమిటి?

ప్రభుత్వం అందజేసే ఫించనులు ఈ కుటుంబాల వారికి ఇస్తుంటే ఏం చేస్తారు? వీరికి రేషన్ కింద సరకులు ఎలా అందజేస్తారు? వీరికి పక్క ఇళ్ళు కట్టిస్తారా? ఇదివరకే కట్టి ఇచ్చిన వారికి ఈ పధకం వర్తింప జేస్తారా? జాతీయ హామీ ఉపాది హామీ పధకం కింద ఈ పధకాన్ని వర్తింప జేస్తారా? లేదా వేరుగానా? వేరుగా అయితే జాతీయ ఉపాది హామీ పధకం మాటేమిటి? ఆరోగ్య భీమా మాటేమిటి? ఇలాంటి వాటికి కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, వారి పార్టీ సభ్యుల దగ్గరనుండి స్పష్టమైన సమాధానం లేదు.

ఒక వేళ పై పధకాలన్నీ ఒక కుటుంబానికి వర్తింప జేసినా , వారి సంవత్సర ఆదాయం షుమారు రూ.2 లక్షలు దాటుతుంది. ఒక వ్యక్తి ఆదాయం రూ.3 లక్షలు అయితే ఆతను కనీస ఆదాయ పన్ను కింద రూ. 2500 కట్టవలసి వుంటుంది. మరి ప్రభుత్వము వారి ద్వారా సంవత్సరానికి రూ.2 లక్షలు అందుతున్నప్పుడు ఎవరు కష్టపడి పని చేస్తారు? ఇక ప్రభుత్వ ఖజానాపై భారానికి వస్తే ఇది దేశ బడ్జెట్లో 13 శాతం వ్యయానికి సమానం అంటున్నారు ప్రఖ్యాత ఆర్దిక వేత్త మరియు మాజీ నీతిఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా. దేశ రక్షణ బడ్జెట్ ని మించి పోతుంది ఈ పధకం ఖర్చు అని అయన తెలియ జేసారు. ఇన్ని నిధులు ఎక్కడ నుండి సమకూర్చు కొంటారో అర్ధం కావట్లేదు అని, ఇది అమలు చేయడం సాధ్యంగాని పని అని ఆయన అన్నారు. ఇంకా కొందరు ప్రముఖ ఆర్దిక వేత్తలు కూడా ఇటువంటి అభిప్రాయ్యాన్నే వెలిబుచ్చారు.

ఇక కాంగ్రెస్సు పార్టీ నాయకుల వాదన వేరేగా ఉంది. మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం ఇంతకు ముందు మరి ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ పధకం అమలు చేయలేక పోయారు అన్న ప్రశ్నకు, విచిత్రమైన సమాధానం ఇచ్చారు. అయన మాట్లాడుతూ 5 ఏళ్ళ క్రితం వరకు అయితే దీని అమలు కష్ట సాధ్యమని మరియు ఇప్పుడు అమలు చేయుటకు సరి అయిన సమయం అని అన్నారు. ఆర్ధిక వృద్ది 12 శాతంగా వుందని, జీ.యస్.టి. మరియు ఇతర పన్నుల రాబడి ఎక్కువగా వుందని అందువల్ల ఇది అమలు చేయుటకు సరి అయిన సమయం అన్నారు. కానీ ఆయన మరియు ఇతర ప్రతిపక్ష నాయకులు ఆర్ధిక వృద్ది చాలా మందగించిందని అది 7 శాతం కూడా లేదని, జీ.యస్.టి.అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని విమర్శించడం ఇక్కడ గమనించాలి. దీని అమలు సాధ్యమే నని మాజీ ఆర్.బి.ఐ. గవర్నర్ రఘురాం రాజన్, మరియు ఇతర ఆర్ధిక వేత్తలను కూడా సంప్రదించామని, వారు దీని అమలుకు ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారని కాంగ్రెస్సు పార్టీ నాయకులు అంటున్నారు. అంటే కాంగ్రెస్సు నాయకుల మాటలలో రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యాలంటే దేశం 3.36 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. గెలిచినచో ప్రతి సంవత్సరం అధికారంలో వున్నన్ని రోజులు సంవత్సరానికి అదేధనం ఖర్చు చేయాల్సి వుంటుంది

గత 5 సంవత్సరములలో ప్రభుత్వం అనేక చర్యల ద్వారా ఆర్దిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టే  ప్రయత్నం చేస్తున్నది. అనేక జాతీయ, అంతర్జాతీయ వొడి దుడుకులను ఎదుర్కొంటూ 7 శాతానికి పైగా వృద్ది రేటు సాధిస్తున్నది. బాలారిష్టాలను అధికమించి జీ.యస్.టి. అమలు గాడిలో పడుతున్నది. మార్చి నెల పన్ను వసూళ్లు ఇప్పటి వరకు ఏ నెలలో సాధించిన దానికంటే అత్యధికం. దీనివల్ల అభివృద్ధి పధకాలకు మూలధనం సమకూర్చుకోనుటకు, అప్పుల భారం తగ్గించు కొనుటకు మంచి అవకాశం. బ్యాంకులకు మూలధనం సమకూర్చి, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను కలపడం ద్వారా, పటిష్ట దివాలా చట్టం తెచ్చి అమలు పరచడం ద్వారా గత యుపియే హయాంలో గతి తప్పిన బ్యాంకింగ్ వ్యవస్థను మరలా పట్టాలకు ఎక్కించడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఇటువంటి సమయంలో మరలా ఆచరణకు సాధ్యం కాని హామీలతో, పధకాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తే అది దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది.

పక్కన వున్న పాకిస్తాన్ ఈ విషయంలో మనకి చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. స్వాతంత్రం సిద్ధించినప్పటి నుండి మత, జాతి విద్వేషాలను రెచ్చగొట్టి, భారత దేశాన్ని బూచి గా చూపి అక్కడి పాలకులు చేసిన అక్రమాలు,దోపిడీ, అవినీతికి దేశానికి దేశమే దివాలా తీసే పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితులలో మనం సాధించిన అభివృద్ధికి సంతోషపడటంతో పాటుగా దాన్ని స్థిరీకరించడానికి మన పాలకులు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలానే వెనుజులా దేశం కూడా. ఆ దేశం ఇలాంటి పధకాన్ని అమలు చేసి దివాలా తీసింది.

ప్రస్తుత మన రాష్ట్ర పరిస్తితి చూస్తే అధికార, ప్రతి పక్ష పార్టీలు రెండు పోటీ పడి మరీ ప్రజలకు, వాగ్దానాలు చేస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు 2,26,177 (2.27 కోట్లకు) చేరుకొన్నాయి. అటు జగన్ కానీ లేదా చంద్రబాబు కానీ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే, వీరు ఇచ్చే హామీలను కలిపితే 40 వేల కోట్లు రూపాయల పై చిలుకు ప్రజాధనం ఖర్చు చేయవలసి వున్నది. ఇది మాములుగా అయ్యే వ్యయం కాక. అసలే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఏవిధంగా వేరు ముందుకు తీసుకువెళతారో చెప్పరు . ఏవిధంగా ఆదాయం సమకూరుస్తారో చెప్పరు . కానీ వీరి సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు హామీలు మాత్రం గుమ్మరిస్తున్నారు.