ప్రతి ఒక్కరికీ న్యాయస్థానాలపై గౌరవం ఉండాలి: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వాస్తవం ప్రతినిధి: ప్రతి ఒక్కరికీ న్యాయస్థానాలపై గౌరవం ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో న్యాయస్థానాలు ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖతో తన అనుబంధం విడదీయరానిదని పేర్కొన్నారు. తన ఎదుగుదల అన్ని విధాలా ఇక్కడి నుంచే ఆరంభమైందన్నారు. న్యాయస్థానాలకు 125 ఏళ్ల చరిత్ర ఉండడం ఎంతో విశేషంతో కూడుకున్నదని చెప్పారు. తెన్నేటి విశ్వనాథం వంటి మహానుభావులు ఇక్కడి నుంచే వృత్తి జీవితాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. దేశంలో 3.12 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు.