కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమైన రామ్ గోపాల్ వర్మ..!

వాస్తవం సినిమా: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా..ప్రస్తుతం సినిమా రంగంలో మరియు రాజకీయ రంగంలోనూ అనేక మంటలు వివాదాలు సృష్టిస్తుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో చంద్రబాబు పాత్ర ప్రతికూలంగా ఉందని సినిమాను రిలీజ్ చేయవద్దని ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా యూనిట్ కి సూచించారు. అయినా కూడా ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌ని వ‌ర్మ సినిమాను విడుద‌ల చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్ బోర్డ్‌ బ్రేక్ వేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నికల సమయంలో రిలీజైతే టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేవీబాబు అనే టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు ప‌లు సూచ‌న‌లు చేయ‌డంతో ఎన్నికలు పూర్తయ్యాక సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ సెన్సార్ వర్గాలు సూచించాయి. అయితే సెన్సార్ బోర్డ్ నిర్ణ‌యాన్ని వ‌ర్మ వ్య‌తిరేకించారు. ఇది అత్యంత దారుణమని సెన్సార్ బోర్డు చాలా అన్యాయంగా వ్యవహరిస్తుందని…సినిమాను విడుదల చేయకుండా ఇలా రాజకీయ నాయకులకు కొమ్ముకాయడం మంచిది కాదని దీనిపై న్యాయపోరాటం చేస్తానని సుప్రీం కోర్టుకు వెళ్తానని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఎలాగైనా ఏప్రిల్ 11న సినిమాను విడుదల చేయడం ఖాయమని రాంగోపాల్ వర్మ ప్రకటించారు.